జన్మ – కర్మ

జన్మ – కర్మ

జన్మ – కర్మ

అనగనగా ఒకనొక ఊరిలో ఇద్దరు మిత్రులు వున్నారు. వారి చదువులు పూర్తయ్యాక ధనార్జన నిమిత్తం, దేశం అంతటా తిరిగి, ఏదైనా వ్యాపారం చేసి, ధనమును సంపాదించాలని నిర్ణయించుకుని, ఒక మంచిరోజు చూసుకుని బయలు దేరారు. కానీ ఎంత దూరం ప్రయాణించిన సరే, వారికి ఏ విధమైన అవకాశం లభించలేదు. చివరికి తిరిగి తిరిగి, విసుగు చెంది, ఒక కూడలి వద్ద నున్న చెట్టు వద్దకు వచ్చాక, ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అక్కడి నుంచి వారిలో ఒకరు దక్షిణ దిక్కుకు వెళ్ళాలని, మరొకరు ఉత్తరదిక్కుకు వెళ్ళాలని, సాయింత్రం సూర్యాస్తమయ సమయానికల్లా మళ్ళా అదే చోటుకు రావాలని, వచ్చాక ఇద్దరూ కూడా తాము సంపాదించిన మొత్తములో అవతలి వారికి సగభాగం ఇవ్వాలి అని.
తమ నిర్ణయానుసారంగా ఇద్దరూ తలోదిక్కుకు బయలు దేరారు. కాసేపు ప్రయాణం గడిచాక, ఉత్తర దిక్కుకు వెళ్ళిన వ్యక్తికి వెండి వస్తువులు దొరికాయి. దక్షిణ దిశకు వెళ్ళిన వ్యక్తి చావుదెబ్బలు తినే పరిస్థితి కలిగింది. మొత్తానికి సూర్యాస్తమయానికల్లా, ముందుగా అనుకున్న ప్రకారం తాము బయలుదేరిన చోటికి చేరుకున్నారు.
కాస్తంత సేదతీరాక, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వ్యక్తి, తన మిత్రుడిని అడిగాడు, ‘నీకు దొరికిన దానిలో నాకు సగభాగం ఇవ్వు. నాకు దెబ్బలు తగిలాయి కాబట్టి నేనేమీ ఇచ్చేది లేదు’ అని. అందుకాతడు ససేమేరా అంటాడు. ఇద్దరూ ఇలా తగువులాడుకోవడం చూసి, అటుగా వెళ్తున్న ఒక సాధువు వచ్చి, ‘నాయనలారా! శాంతం, శాంతం. ఏమిటి మీ సమస్య? ఎందుకు వాదులాడుకొనుచున్నారు?’ అని అడుగగా… అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు చెప్పారు. ఆ సాధువు ఒక్కక్షణం కళ్ళుమూసుకుని యోచించి, ‘బిడ్డలారా! మీరు ఇద్దరూ మీకు లభించిన ఫలం గురించి మాట్లాడుకొనుచున్నారే కానీ, దానికి కారణమైన కర్మ విశేషం గురించి ఏ మాత్రం ఆలోచించకున్నారు. ఉత్తరదిశగా వెళ్ళిన నీకు పూర్వజన్మసుకృత వశమున బంగారము లభించాల్సివున్నది కానీ నీవు ఈ జన్మలో ఏమాత్రము దైవీభావనలేక, అథముని వలె ఇప్పటిదాక నీ స్వార్థంతో నీ జీవనం సాగించావు. అంచేత నీకు కేవలం వెండి మాత్రమే లభించినది. అలానే దక్షిణ దిశగా వెళ్ళిన నీవు, పూర్వజన్మయందు ఘోర అకృత్యాలకు పాల్పడినావు, కానీ ఈ జన్మలో దైవం పట్ల అనురక్తి, భక్తి కలిగి, అందరిపట్ల ప్రేమగా, దీనులయడ దయతో వ్యవహరించేలా నీ ప్రస్తుత జీవనం వున్నది. అంచేత ఘోర ప్రమాదానికి గురికావాల్సిన నీవు కేవలం దెబ్బలతోనే బయటపడగలిగావు. ఇదీ కథ.

మన ప్రయత్నాలకు, మనం నేడు అనుభవిస్తున్న సుఖదుఃఖాలకు కారణం ఇప్పటి జన్మలోనిదే అనుకుంటే పొరపాటు. కొంతమంది పుట్టుకతోనే ఆగర్భశ్రీమంతులుగా పుడుతున్నారు, కొంతమంది కటిక పేదవారిగా పుడుతున్నారు. ఎందుకని అంత వ్యత్యాసం? అని ప్రశ్నించుకుని, బాగుగా విచారణ చేస్తే, అప్పుడు ‘కర్మసిద్ధాంతం’ బోధపడుతుంది. పిదప పూర్వజన్మకర్మ ఫలాన్ని, ప్రారబ్ధ కర్మను తీవ్ర ప్రయత్నంతోనూ, భగవంతునిపై అచంచల విశ్వాసము, ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలతో అధిగమించవచ్చునని తెలుస్తుంది. ఇదే విషయం ఎందరో భక్తుల జీవితాలలో తరతరాలనుంచి రుజువు అవుతూనే వున్నది.

Leave a Reply

Your email address will not be published.